మనం ఉత్తములను, మధ్యములను మరియు అధములను సంపాదన విషయంలో కూడా చూడొచ్చు!
అవసరాలు మరియు కోర్కెలు తీరుతున్నంతసేపూ అందుకు కారణమైన సంపాదన ఎక్కడనుండి వస్తోందనే బెంగ ఉండదు, అదే అవసరాలు తీరడం బహు కష్టంగా ఉన్నప్పుడు వెంటనే డబ్బు వచ్చే మార్గాలకై సంఘర్షణ మొదలవుతుంది. ఇలాంటి కుటుంబాలు అధమ కుటుంబాలు.
సమయస్ఫూర్తి కలిగిన కుటుంబాలు పైన పేర్కొన్న కుటుంబాల నుండి అత్యవసర నిధిని ఏర్పాటుచేసుకోవడంలో కృతకృత్యం అవుతుంటాయి. ఇవి మధ్యమ కుటుంబాలు, మధ్యతరగతనే ఆర్థికవర్గం వెనకున్న ఆలోచన ఇది; ఈ విధంగా చూస్తే నేడు మధ్యతరగతి అనే వర్గం ఉన్నట్లుగా అనిపించడంలేదు!
"నేడు గడిస్తేచాల"నుకోవడమే పేదరికానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. ఇలాంటి కుటుంబాలు మధ్యతరగతిలో ఈనాడు ఎక్కువయ్యాయి; ఇవి సంపాదన విషయంలో మెరుగ్గా ఉన్నా దాన్ని ఖర్చు పెట్టే ఆలోచనల విషయంలో అధములుగానే మిగిలిపోయారు. పారిశ్రామికీకరణ కౌటుంబిక వ్యవస్థలో తెచ్చిన అనేక పెనుమార్పుల్లో ఇదొకటి. ఉమ్మడి పరివారం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి పరిష్కారమని భావించారు పెద్దలు.
కర్మాగారాలు వచ్చాయి గనుక,
యంత్రాలే అన్ని చేస్తాయి గనుక,
మనుషులు ఎక్కువగా అక్కర్లేదు,
"ఎక్కువ చేతులు = ఎక్కువ సంపాదన" అనే సిద్ధాంతం తన ప్రాముఖ్యతను కోల్పోయింది.
కానీ యంత్రాలే అన్నీ చేస్తున్నాయా?
పోనీ అవే అన్ని పనులూ చెయ్యడం వలన జనాభా తగ్గిందా?
కొత్త ఆర్థిక సిద్ధాంతాలు యంత్రాలనాధారం చేసుకొని విరివిగా పుట్టుకొస్తున్నా, జనాభా అదుపులోకి రాకపోవడాన్ని ఎలా చూడాలి?
పెరుగుతున్న జనాభా యొక్క సాంఘిక అవసరాలను తీర్చే సామాజిక వ్యవస్థల రూపకల్పనలు జరగడం ఆగిపోవడమే ధనం/సంపద అనేది కొందరి చేతుల్లోనే ఉండడానికి కారణం.
దూరదృష్టి కలిగిన కుటుంబాలు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని తమ దగ్గరున్న ధనాన్ని వినియోగించి ఆస్తులను కూడగట్టుకోవడం మనకు కనిపిస్తుంది. కానీ మనం ఎందుకని అలా చెయ్యలేకపోతున్నామనే స్పృహ మనలో ఉండదు.
కారణం?
ఒకే ఆలోచనలు కలిగిన పాశ్చాత్య కమ్యూనిటీ అనే ఊహ మనకు నచ్చుతుంది, కానీ ఒకే ఉపజాతి లేదా కులం అనే ఊహ మాత్రం మనకు నచ్చదు. కాకపోతే ఇక్కడున్న అతిపెద్ద సమస్య ఏంటంటే పాశ్చాత్య సమాజంలో కమ్యూనిటీ అన్నప్పుడు శరీరఛాయనో లేక మతాన్నో లేక చర్చినో లేక కుటుంబాన్నో ప్రాతిపదికగా తీసుకోవడం జరుగుతుంది.
మరిక్కడ?
యంత్రాలు మారినా, తంత్రాలు మారినా, మంత్రాలు మారినా ధనం కుటుంబంలోనే, కులంలోనే, జాతిలోనే ఉంటుంది. ఆ కుటుంబాన్ని, కులాన్ని, జాతిని మనకు మనమే సమానత్వం పేరిట నాశనం చేసుకుంటున్నాం. అందుకే మధ్యతరగతి కూడా ఇక్కడ పేదరికంలోనే మగ్గుతోంది.
నిజ శ్రావణ బహుళ పంచమి, 2080
Comments
Post a Comment